న్యూఢిల్లీ : పంజాబ్ గవర్నర్ పరిశీలనకు పంపిన రెండు బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితిని నిర్దేశించవచ్చా.. లేదా అనే విషయంపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పు వరకూ వేచి చూడాలని నిర్ణయించింది. పంజాబ్ ప్రభుత్వ పిటిషన్‌ను సిజెఐతో పాటు జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్‌వి అంజరియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఇలాంటి పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని వాదించారు. ఈ వాదనలను పంజాబ్ తరుపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వ్యతిరేకించారు. కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి సమయం కోరారు. ఈ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి గవారు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించిన తర్వాత ఈ పిటిషన్ జాబితా చేయాలని ఆదేశించారు. ‘రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తరువాత, అన్ని ఇతర ధర్మాసనాలు ఆ తీర్పును అనుసరించడానికి కట్టుబడి ఉంటాయి’ అని సిజెఐ వ్యాఖ్యానించారు.