వాషింగ్టన్:రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న విషయంలో భారత్‌పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్యలను తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య హోదాపై ప్రభావం పడుతుందని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో హెచ్చరించారు. అయితే, ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమను అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని, అమెరికా సహా ఐరోపా దేశాలు కూడా రష్యాతో ఇప్పటికీ వాణిజ్యం చేస్తున్నాయని గుర్తు చేసింది. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో పీటర్ నవారో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనడం వల్ల, పరోక్షంగా ఉక్రెయిన్‌పై మాస్కో చేస్తున్న యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నట్టే అవుతుందని ఆయన ఆరోపించారు. “భారత్ ఒకే సమయంలో రష్యా, చైనాలతో సన్నిహితంగా మెలుగుతోంది. అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగాలనుకుంటే, అందుకు తగినట్టుగా భారత్ ప్రవర్తించడం మొదలుపెట్టాలి” అని ఆయన స్పష్టం చేశారు.