ఢిల్లీ:: లో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఓట్ల చోరీ దుమారం వేళ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సరిగ్గానే ఉందని.. పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడులో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఈసీ చెబుతోంది. ఈసీ అలా ఎలా చెబుతుంది..? తప్పుడు ఓటర్ల జాబితాను ఉపయోగించే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా నిర్వహిస్తే అది దేశవ్యాప్తంగా జరగాలి. అంతకంటే ముందు లోక్‌సభను రద్దు చేయాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమే. తృణమూల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలందరూ అందుకు సిద్ధమే. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు.
ఓట్ చోరీపై నిరసన జ్వాలలు
బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నిన్న విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలో ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ చౌర్యానికి వ్యతిరేకంగా పార్లమెంట్ హౌస్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు సోమవారం ప్రతిపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు వెళ్లకుండా మధ్యలోనే పీటీఐ భవనం వెలుపల బారికేడ్లు వేసి అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ఎంపీలు నిరసన తెలిపారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు బారికేడ్లు ఎక్కి ఎన్నికల కమిషన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డు పక్కన వరసగా నిలిపి ఉంచిన బస్సులలో ఎంపీలను బలవంతంగా ఎక్కించిన పోలీసులు వారిని పార్లమెంట్ వీధి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత ఎంపీలు అందరినీ పోలీసులు విడిచిపెట్టారు.