మోదీ రూ.30 వేల కోట్లు దొంగిలించారు :రాహుల్‌

మోదీ రూ.30 వేల కోట్లు దొంగిలించారు :రాహుల్‌

దిల్లీ: రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ ఒప్పందం అంశంపై మరోసారి విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. దిల్లీలో .శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఫేల్‌పై ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. రఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపిందని తాజా నివేదికలో తేలిందన్నారు. రఫేల్‌ ఒప్పందంలో పీఎంవో జోక్యంపై రక్షణశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనంతో మరోసారి రఫేల్‌ వేడి రాజుకుంది. ‘రఫేల్‌ ఒప్పందం విషయంలో రక్షణశాఖ నిర్ణయాలకు భిన్నంగా పీఎం కార్యాలయం ప్రవర్తించింది. ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపింది’ అని నవంబరు 24,2015న రక్షణశాఖ ఓ నివేదికలో పేర్కొన్నట్లు ఆ కథనం తెలిపింది. ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్‌ కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘రక్షణశాఖకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌తో పీఎంవో నేరుగా చర్చలు జరిపింది. ఈ చర్చలు మీకోసమో, నా కోసమో కాదు.. అనిల్‌ అంబానీ కోసం. దీనిపై రక్షణశాఖ అభ్యంతరం చెప్పినట్లు తాజా నివేదిక పేర్కొంది. దీన్ని బట్టి చౌకీదారే దొంగ అని రుజువైంది’.‘రఫేల్‌ కుంభకోణంలో ప్రధాని మోదీ ప్రత్యక్ష పాత్ర ఉందని గత ఏడాది కాలంగా మేం చెబుతూనే ఉన్నాం. ఈ రోజు దానిపై మరింత స్పష్టత వచ్చింది. రఫేల్‌పై ప్రధాని మోదీ, రక్షణశాఖ పదే పదే అంత విశ్వాసంగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారని నేను ఆశ్చర్యపోయా. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది.. వారు అధికారంలో ఉన్న సమయంలో నిజాయతీగా ఒక్క రక్షణ ఒప్పందం కూడా చేసుకోలేదు. మామలు, బాబాయిలు మధ్యలో ఉన్నారు’ అని రాహుల్‌ ఆరోపించారు.

రఫేల్‌ ఒప్పందంపై ప్రధాని మోదీ రూ. 30వేల కోట్లను అనిల్‌ అంబానీకి దోచిపెట్టారని, మోదీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని రాహుల్‌ ధ్వజమెత్తారు. రఫేల్‌పై కేంద్రం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos