ట’మాటలతో వ్యాపారుల దందా – ప్రతి రైతు నుంచి 10 శాతం కమీషన్‌ వసూలు

ట’మాటలతో వ్యాపారుల దందా – ప్రతి రైతు నుంచి 10 శాతం కమీషన్‌ వసూలు

కర్నూలు: టమాటా రైతులను వ్యాపారులు నిలువునా ముంచేస్తున్నారు. పత్తికొండ, ప్యాపిలి, డోన్, దేవనకొండ తదితర ప్రాంతాల్లోని టమాటా మార్కెట్లలో సరకు అమ్మిన ప్రతి రైతు నుంచి పది శాతం కమీషన్‌ను వ్యాపారులు, మండీ నిర్వాహకులు కలిసి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నప్పటికీ మార్కెటింగ్‌ శాఖ, పాలకవర్గాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.అడ్డగోలుగా వసూలు చేసే సొమ్ము నుంచి మండీ నిర్వాహకులకు ఐదు శాతం, కొనుగోలు చేసిన వ్యాపారికి మరో ఐదు శాతం అక్రమంగా బదిలీ అవుతోంది. ఈ సొమ్ము కనీసం మార్కెట్‌ కమిటీకి చేరడం లేదు. రైతుల నుంచి ఎలాంటి కమీషన్‌ వసూలు చేయరాదని ఐదేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ నిబంధనలు తుంగలో తొక్కేశారు. యార్డులో వ్యాపారాలు చేసుకునేందుకు మార్కెట్‌ కమిటీకి ఒక శాతం సెస్‌ (సుంకం) చెల్లించాలి. అదెక్కడా చెల్లించిన దాఖలాలు లేవు.ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు : రైతు పది గంపల పండ్లను మార్కెట్‌కు తెస్తే రెండు గంపలు తగ్గించేస్తున్నారు. ఆటోలో తరలించే క్రమంలో పది గంపలకు బాడుగ చెల్లించక తప్పని పరిస్థితి. వ్యాపారులు గ్రేడింగ్‌ పేరుతో దోచేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 గంపల్లో సరకు తెస్తే గ్రేడింగ్, తూకాల పేరుతో 36 గంపలకు కుదించారు. ఆ నాలుగు గంపలకు కోత కూలీలు, ఆటో ఖర్చులు వివరిస్తారు. మార్కెట్లో పచ్చి మోసం జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు లేదని ఆలూరుకు చెందిన దివాకర్‌ వాపోయారు.అడ్డగోలుగా వ్యాపారుల దందా : ఆయా మార్కెట్లలో వ్యాపారులంతా కుమ్మక్కై వారు నిర్ణయించిన ధరకే అమ్మాల్సిన పరిస్థితి తప్పడం లేదు. వ్యాపారులంతా ఇక్కడి సరకును కొనుగోలు చేసి చెన్నై, హైదరాబాద్, వరంగల్, విజయవాడ తదితర ప్రాంతాల్లో మార్కెట్లకు తరలించి రెండింతలు ఆదాయం చేసుకుంటున్నారు. రిటైల్‌గా టమాటా కిలో రూ.40 పలుకుతున్నా సరే రైతుకు మాత్రం కిలోకు రూ.15 నుంచి రూ.20 మాత్రమే ధర లభిస్తోంది. పత్తికొండ మార్కెట్‌ కమిటీని దందాకు అడ్డాగా మార్చుకుని వ్యాపారులు కొనసాగిస్తోంది కేవలం నలుగురు వ్యాపారులే కావడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos