న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 10 రోజులవుతున్నా లోక్‌సభ లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. బీహార్ లో ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కంటిన్యూ చేశారు. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ప్రత్యేక చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓంబిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ పునఃప్రారంభం కానుంది.అయితే లోక్‌సభలో 10వ రోజూ కూడా ఎలాంటి చర్చ జరగకపోయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్వెన్సీస్ ఆఫ్ ద స్టేట్ గోవా బిల్లు – 2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు – 2025, మర్చంట్ షిప్పింగ్ బిల్లు – 2024 ఉన్నాయి.