బెంగుళూరు : మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ మనవడు.. హసన్ నియోజకవర్గానికి చెందిన జనతాదళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా తేలారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టే ప్రత్యేక కోర్టు రేవణ్ణ కేసులో ఇవాళ తీర్పు ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణపై మూడు అత్యాచారం కేసులు ఉన్నాయి. ఒకటి లైంగిక దాడి ఆరోపణ కేసు ఉన్నది. అయితే ఓ కేసులో పూర్తి స్థాయి విచారణ ముగిసింది. హసన్‌లోని గన్నికాడ ఫార్మ్‌హౌజ్‌లో ఉన్న ఇంట్లో 48 ఏళ్ల మహిళ పనిమనిషిగా చేసింది. ఆమెపై రేవణ్ణ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాధితురాలి కేసులో ఇవాళ ప్రత్యేక కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే ఆగస్టు 2వ తేదీన ఈ కేసులో శిక్షకు సంబంధించిన తుది తీర్పును ఆ కోర్టు వెల్లడించనున్నది.