ఎస్‌ఐఆర్‌ దిశగా అడుగులు

ఎస్‌ఐఆర్‌ దిశగా అడుగులు

అమరావతి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధత దిశగా అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసరు (సిఇఒ)  ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి రావాలంటూ ఆయా పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఓటర్ల జాబితా చట్టపరమైన పరిధికి లోబడి ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంతో పాటు ఓటర్ల సవరణకు ముందు కార్యకలాపాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. పైకి ఎన్నికల వ్యవస్థ బలోపేతం చేయడం ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు సమావేశాలని చెబుతున్నప్పటికీ ఇది ఎస్‌ఐఆర్‌ అమలుకు సన్నద్ధం చేయడానికేనని విశ్లేషకుల భావన. బీహార్‌లో ఇప్పటికే ఎస్‌ఐఆర్‌ వివాదం నడుస్తోంది. సవరణల పేరుతో దొడ్డిదారిన పౌరసత్వచట్ట అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తో ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అంతే కాకుండా భారీగా ఓట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షపార్టీలు సడక్‌ సే సదన్‌ తక్‌ (వీధి నుంచి సభ వరకు) పేరుతో పోరాటాలు చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీహార్‌ ఎస్‌ఐఆర్‌ పేరుతో .జరుగుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలను పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇండియా బ్లాక్‌ నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను జనరైలైజ్‌ చేస్తూ అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు, సలహాలు, సూచనలంటూ ఓటర్ల తొలగింపు ప్రక్రియ తీవ్రతను తగ్గించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఓటర్ల జాబితా సవరణను పౌరసత్వంతో ముడి పెట్టరాదని ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని లిఖిత పూర్వకంగా కోరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఏం చేయనున్నదీ గురువారం నాటి సమావేశంలో కొంత వెల్లడవుతుందని భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos