స్మార్ట్‌ మీటర్ల షాక్‌

స్మార్ట్‌ మీటర్ల షాక్‌

జైపూర్‌ : రాజస్థాన్‌లో విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్ల షాక్‌ కొడుతోంది. బిజెపి పాలిత రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో దాదాపు పూర్తి స్థాయిలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లను ఖర్చు చేసింది. గతంలో పాత విద్యుత్‌ మీటర్‌తో ఏ వినియోగదారుడూ ఎటువంటి సమస్యను ఎదుర్కోలేదు. తాజా స్మార్ట్‌ మీటర్లతో ఇప్పుడు వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత మీటర్లతో పోలిస్తే స్మార్ట్‌ మీటర్ల రీడింగ్‌లు చాలా వేగంగా తిరుగుతున్నాయి. ఇది వరకటితో పోలిస్తే 15 శాతం బిల్లులు అధికంగా వస్తున్నాయని వేలాదిమంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నెలవారీ బిల్లులు గురించి విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటే పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ మీటర్లలో రీడింగ్‌ నమోదైన తరువాత తామేమీ చేయలేమని అధికారులు చేతులేత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా వచ్చినా బిల్లు కట్టాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే జరిమానా విధిస్తున్నారని, నోటీసు లేకుండా కనెక్షన్లు కట్‌ చేస్తున్నారని చెప్పారు. తిరిగి మళ్లీ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.2,500 వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.

బిల్లు గణనీయంగా పెరిగింది : స్థానికులు హల్దీఘాటీ మార్గ్‌లోని తిరుపతినగర్‌కు చెందిన దినేష్‌ వర్మ స్థానిక మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు తరువాత విద్యుత్‌ బిల్లు పెరిగాయని, మునుపటి బిల్లులతో పోల్చినప్పుడు గణనీయమైన తేడా కనిపించిందని చెప్పారు. తిరుపతి బాలాజీ నగర్‌కు చెందిన వినియోగదారుడు వినోద్‌ థాపా మాట్లాడుతూ అధికంగా వచ్చిన బిల్లును గడువులోపు చెల్లించలేకపోయానని, దీంతో తన కనెక్షన్‌ తొలగించినట్లు చెప్పారు. మళ్లీ కనెక్షన్‌ ఇవ్వడానికి అదనంగా రూ.2500 వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ధాని ఝాత్వారాకు చెందిన రణవీర్‌ సింగ్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్‌ ఏర్పాటు తరువాత బిల్లులు పెరిగాయని, సమస్యను అనేకసార్లు అధికారులకు నివేదించినా ఎలాంటి పరిష్కారం చూపలేదని చెప్పారు. స్మార్ట్‌ మీటర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హనుమాన్‌గఢ్‌లో సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం రాత్రి కాగడాల ప్రదర్శన చేశారు. స్మార్ట్‌ మీటర్లను అనుమతించేది లేదంటూ ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos