7 రోజుల పాటు వానలే వానలు

7 రోజుల పాటు వానలే వానలు

న్యూ ఢిల్లీ:దేశ వ్యాప్తంగా రానున్న 6-7 రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఈ సమయంలో వాయువ్య, మధ్య, తూర్పు భారత్​లోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని తెలిపింది.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, బిహార్, బంగాల్, సిక్కిం జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లో కొన్ని ప్రాంతాలు సహా ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు కూడా వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

జులైలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు

జులై నెలలో దేశ వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదువుతుందని ఐఎండీ సోమవారం అంచనా వేసింది. మధ్య భారతదేశం, ఉత్తరాఖండ్, హరియాణా ప్రాంతాల్లో వరద ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈశాన్య, తూర్పు భారతదేశం, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మధ్య భారతదేశం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. ఇందులో తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, విదర్భ, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘మహానది, గోదావరి, కృష్ణా వంటి నదుల పరివాహక ప్రాంతాలను పర్యవేక్షించాలి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పరిధిలో ఉన్న ఎగువ మహానది పరివాహక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. వర్షపాతం, జలాశయాల నీటి మట్టాలను నిరంతరం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఉత్తరాఖండ్, హరియాణాలోనూ భారీ వర్షపాతం నమోదవుతుంది” అని మోహపాత్ర అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos