న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో మంగళవారం పార్లమెంట్లో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు సామాజిక కార్యకర్త మేధా పాట్కర్, ప్రకాశ్ రాజ్‌లు హాజరయ్యారు. దీంతో వివాదం చెలరేగింది. భూ వనరుల శాఖ, పంచాయతీ రాజ్ శాఖలు రెండు ముసాయిదా తీర్మాలను రూపొందించాయి. దానిపై చర్చిచేందుకు చేపట్టింది పార్లమెంటరీ ప్యానెల్ మీట్ రసాభాసగా మారింది. తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు కొన్ని ఎన్జీవోల తరపున సభ్యులు మీటింగ్ హాజరయ్యారు. పునర్ నివాసం హక్కుల గురించి తమ అభిప్రాయాలు వినిపంచేందుకు కొందరు నేతలు వచ్చారు. అయితే జాబితాలో లేని నేతలు మీటింగ్‌కు ఎలా వస్తారని బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేధా పాట్కర్, ప్రకాశ్ రాజ్ రాక గురించి తమకు వెల్లడించలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతో వాళ్లను ఆహ్వానించినట్లు బీజేపీ ఆరోపించింది. బీజేఈ ఎంపీ పురుషోత్తం రూపాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జాతీయ ప్రయోజనాలకు చెందిన ప్రాజెక్టులను మేధా పాట్కర్ వ్యతిరేకించారని, ఆమెకు ఈ మీటింగ్‌లో మాట్లాడే హక్కు లేదని రూపాలా అన్నారు. బీజేపీ ఎంపీలు డాక్టర్ సంజయ్ జైస్వాల్, రాజు బిస్తా, జుగల్ కిషోర్ కూడా పురుషోత్తం రూపాలాకు మద్దతిచ్చారు. సాక్షుల జాబితాను పారదర్శకంగా ఇవ్వలేదని, చైర్మెన్ వైఖరిని బీజేపీ ఎంపీలు విమర్శించారు. పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్‌కు ప్రకాశ్ రాజ్ ఎందుకు వచ్చారని పలుమార్లు బీజేపీ ఎంపీలు ప్రశ్నించారు. సభ్యుల వద్ద ఉన్న లిస్టులో అతని పేరులేదన్నారు. లోక్‌సభ స్పీకర్ అనుమతి ఉన్నట్లు చైర్మెన్ చెప్పినా.. బీజేపీ ఎంపీలు ఆమోదించలేదు. కాంగ్రెస్ ఎంపీలు చైర్మెన్‌కు సపోర్టు ఇవ్వగా, బీజేపీ ఎంపీలు దీన్ని వ్యతిరేకించారు. పది ఎన్జీవోలకు చెందిన ప్రతినిధులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో.. బీజేపీ ఎంపీలు ఆ మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. దీంతో మీటింగ్‌కు వాయిదా వేశారు.