పూరీ: జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జై జగన్నాథుడి నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్రలో అధిక వేడి, రద్దీ కారణంగా పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 600 మందికిపైగా భక్తులు అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. ‘శుక్రవారం జరిగిన రథయాత్ర సందర్భంగా దాదాపు 625 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఎండ, ఉక్కపోత, రద్దీ కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని ఆసుపత్రుల్లో చేర్పించాల్సి వచ్చింది. రథాలను లాగేందుకు పోటీపడి పలువురు స్వల్పంగా గాయపడ్డారు’ అని అధికారులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం పలువురు డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు రథయాత్రకు ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ విచ్చేసి జగన్నాథునితో పాటు దేవీ సుభద్ర, బలభద్రుని రథం లాగారు.