పూరీ : జగన్నాథుని రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ప్రతి గే రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు ‘జై జగన్నాథ్’, ‘హరిబోల్’ నినాదాలతో రథం వెంట నడుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారుల అంచనా. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఒడిశా ప్రభుత్వం.. తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనిక భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు అంతేకాదు,. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడటం ఒక అదృష్టంగా భావిస్తారు.