చెన్నై : రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదనలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై పునరాలోచించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రైళ్ళలో ఎసి కోచ్‌లను పెంచడం కోసం జనరల్ బోగీల సంఖ్యను తగ్గించవద్దని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. వెల్లూరు, తిరుపత్తూరు జిల్లాల్లో అధికార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బుధవారం ఉదయం స్టాలిన్ చెన్నై సెంట్రల్ నుండి కాట్పాడికి రైలులో ప్రయాణించారు. రైల్వే స్టేషన్‌లో ప్రజలతో మాట్లాడినట్లు చెప్పారు. చార్జీలు పెరుగుతాయనేసరికి ప్రజల్లో భయం పట్టుకుందని అన్నారు. అలాగే జనరల్ కోచ్‌ల తగ్గింపు పట్ల కూడా వారు ఆందోళన చెందుతున్నారన్నారు. పేదలు, మధ్యతరగతి వారికి రైల్వేలు అంటే కేవలం రవాణాసాధనమే కాదని, వారి రోజువారీ జీవితాల్లో ఒకఅంతర్భాగమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం, గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మళ్ళీ ఈ చార్జీల మోత వద్దని, వారిపై భారం వద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. భారతీయ రైల్వే అంటే ఒక సర్వీస్ కాదని, ఒక కుటుంబమని ఆయన వ్యాఖ్యానించారు.