జగన్‌పై మరో కేసు

జగన్‌పై మరో కేసు

అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై మరో పోలీసు కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో ఆయన జరిపిన పర్యటనకు సంబంధించి ఈ కేసు దాఖలైంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉండగా, నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.ఫిబ్రవరి 19న మిర్చి రైతులను పరామర్శించేందుకు జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉందని, వైసీపీ నేత‌లు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా యార్డుకు వచ్చి హడావుడి చేశారని ఆరోపణలున్నాయి. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ ప్రాంగణమైన మిర్చి యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటన నేపథ్యంలో జగన్‌తో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తదితరులపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరికీ ఇప్పటికే సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు పిలిచినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సూచించారు.కాగా, పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలోనూ జగన్‌పై కేసు నమోదైన విషయం విదితమే. తాజాగా గుంటూరు మిర్చి యార్డు ఘటనతో ఆయనపై మరో కేసు నమోదైనట్లయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos