అటు ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటన..కొనసాగుతున్న ఘర్షణలు

అటు ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటన..కొనసాగుతున్న ఘర్షణలు

టెహరాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్షణక్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున టెల్ అవీవ్ను లక్ష్యంగా చేసుకొని టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో పలుచోట్ల సైరన్ల మోత మోగింది.ఇరాన్ క్షిపణులు తమ దేశం వైపు దూసుకొస్తున్నాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రజలను హెచ్చరించింది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణులు ప్రయోగించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. జెరూసలెం, బీర్షెబా ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల కారణంగా బీర్షెబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. అందులోని ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కాగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక కథనాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఇరాన్ 6 క్షిపణులను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.ఇరాన్, ఇజ్రాయెల్ పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందన్నారు. అయితే, ఈ ప్రకటనపై తొలుత విరుద్ధ ప్రకటన చేసిన ఇరాన్.. ఆ తర్వాత ఒప్పందానికి సుముఖత వ్యక్తంచేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos