అమెరికా దాడులకు ముందే ఇరాన్ అప్రమత్తం.. 400 కిలోల యురేనియం తరలింపు

అమెరికా దాడులకు ముందే ఇరాన్ అప్రమత్తం.. 400 కిలోల యురేనియం తరలింపు

టెహరాన్‌:ఇరాన్ అణు కార్యక్రమం చు‌ట్టూ అలముకున్న ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసినప్పటికీ, ఆ దేశం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో తమకు తెలియదని అమెరికా ఉన్నతాధికారులు అంగీకరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాడులకు ముందే ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, సుమారు 400 కిలోగ్రాముల అత్యంత శుద్ధి చేసిన యురేనియం‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించిందన్న వార్తలు ఈ ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అణు వివాదం ముదురుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్, ఇరాన్ అణు ముప్పును నిర్వీర్యం చేశామని ప్రకటించారు. 20న అమెరికా దళాలు, ఇజ్రాయెల్ నిఘా వర్గాల సహకారంతో, ఇరాన్‌లోని ఫోర్డో, నతాన్జ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడులతో ఇరాన్ అణు సామర్థ్యం ‘పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని’ ట్రంప్ తన మద్దతుదారులకు తెలిపారు.అయితే, అమెరికా వాదనలను ఇరాన్ అధికారులు తక్షణమే తిప్పికొట్టారు. తమ కీలక అణు మౌలిక సదుపాయాలకు ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని, యురేనియం శుద్ధి చేసే సామర్థ్యం కూడా తగ్గలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా, విదేశాంగ శాఖ ప్రకటించాయి. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం అమెరికా దాడులకు ముందే ఫోర్డో అణు కర్మాగారం నుంచి ఇరాన్ సుమారు 400 కిలోగ్రాముల (దాదాపు 880 పౌండ్లు) 60 శాతం స్వచ్ఛత కలిగిన శుద్ధి చేసిన యురేనియం‌ను, ఇతర కీలక పరికరాలను తరలించిందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అణ్వాయుధాల తయారీకి సాధారణంగా ఉపయోగించే 90 శాతం స్వచ్ఛతకు ఇది చాలా దగ్గరగా ఉండటం గమనార్హం.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా పలువురు సీనియర్ అధికారులు మాట్లాడుతూ ఇరాన్ యురేనియం నిల్వలు ప్రస్తుతం ఎక్కడున్నాయో తమకు తెలియదని అంగీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఈ విషయాన్ని తాము ఇరాన్‌తో చర్చించబోతున్నట్టు వాన్ తెలిపారు.మరోవైపు, ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్న ట్రంప్ వాదనను పూర్తిగా సమర్థించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos