రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో రేషన్ దుకాణం వద్ద తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. నెలవారీ ఆహార ధాన్యాల కోసం గంటల తరబడి వేచిచూసిన ప్రజలు, తీవ్ర అసహనంతో దుకాణం ప్రధాన గేటును బద్దలగొట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. అయితే, పదేపదే తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అనేక దుకాణాల వద్ద తీవ్రమైన నిర్వహణ లోపాలు కనిపిస్తున్నాయి.నిన్న సేల్స్‌మ్యాన్ దుకాణం లోపల ఉన్నప్పటికీ గంటల తరబడి షాపును మూసివేయడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో సహనం కోల్పోయిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు, రేషన్ షాపు ఇనుప గేటును బలవంతంగా తెరిచారు. ఒక్కసారిగా జనం లోపలికి దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కిందపడిపోగా, వారికి స్వల్ప గాయాలయ్యాయి.ఇలాంటి గందరగోళం జరగడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రజలు ఉదయాన్నే లైన్లలో నిలబడుతున్నా, సాంకేతిక సమస్యల కారణంగా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వస్తోందని వాపోయారు. “ఓటీపీ వెరిఫికేషన్‌లో వైఫల్యం, వేలిముద్రలు సరిపోలకపోవడం, పదేపదే సర్వర్ డౌన్ కావడం ప్రధాన సమస్యలు” అని స్థానికుడు ఒకరు తెలిపారు. రోజుకు 20 నుంచి 25 మందికి మాత్రమే రేషన్ అందుతోందని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న సేల్స్‌మ్యాన్ రమేశ్ నిర్మల్కర్ మాట్లాడుతూ కొత్త బయోమెట్రిక్ మెషీన్ వల్లే ఈ ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు. “ప్రతి వ్యక్తికి ఓటీపీ కోసం మూడుసార్లు, వేలిముద్రల కోసం ఐదారుసార్లు స్కాన్ చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి ఒక్కో లబ్ధిదారుడికి 30 నిమిషాలకు పైగా సమయం పడుతోంది” అని ఆయన వివరించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే, జిల్లాలోని అనేక రేషన్ కేంద్రాల్లో ఇలాంటి సమస్యలే కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం స్పందిస్తూ “విషయాన్ని పరిశీలించి, దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చింది.