న్యూ ఢిల్లీ : కులగణన నిర్వహణ డిమాండును దేశ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు 24 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఓబీసీ నేతలతో ప్రత్యేక బృందాన్ని రాహుల్ గాంధీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2027లో జనగణనతో పాటు కులగణనను మోదీ సర్కారు నిర్వహించకపోవచ్చనే సందేహంతో ప్రజలతో మమేకం కావాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ సందేశాన్ని ఓబీసీల వద్దకు తీసుకెళ్లే ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. 24 మంది ఓబీసీ నేతల జట్టులో కర్ణాటక సీఎం కె.సిద్ధరామయ్య, మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, ఎం.వీరప్ప మొయిలీ, భూపేశ్ బఘేల్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు బీకే హరిప్రసాద్, సచిన్ పైలట్, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, గుజరాత్ విపక్ష నేత అమిత్ చవ్దా, ఏఐసీసీ నుంచి అజయ్ కుమార్ లల్లూ, జితేంద్ర బఘేల్ తదితరులు ఉంటారని సమాచారం. ఓబీసీలకు సంబంధించి దేశ వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా లేవనెత్తదగిన అంశాలతో ఒక బ్లూ ప్రింట్‌ను ఈ బృందం రూపొందిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగాల ద్వారా ఇదే పనిని చేయించాలని ప్రయత్నించినప్పటికీ ప్రజల నుంచి తగినంత స్పందన రాలేదు. దీంతో దేశంలోని దిగ్గజ ఓబీసీ నేతలతో కూడిన ప్రత్యేక జట్టును రంగంలోకి దింపదలచారు. ఓబీసీ వర్గం ప్రజానీకం లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అమలు చేయదగిన ప్రణాళికను ఈ కమిటీ అందిస్తుంది. ఈ అడ్వైజరీ కమిటీకి కన్వీనర్‌గా ఏఐసీసీ ఓబీసీ విభాగాధిపతి అనిల్ జైహింద్ వ్యవహరించ నున్నారు. త్వరలోనే ఈ కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించ నుందని సమాచారం.