కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాలు జిల్లాలో హింస చోటుచేసుకున్నది. రెండు వర్గాల ప్రజలు విధ్వంసానికి దిగారు. మిటాబ్రుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రబీంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మహేస్తల ప్రాంతంలో నిర్మించిన శివాలయాన్ని కొందరు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న ఆక్రమిత ప్రాంతంలో కొందరు షాపులు ఏర్పాటు చేయడంతో గొడవ జరిగింది. వివాదాస్పద భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఓ మోటారు సైకిల్‌కు నిప్పుపెట్టారు. ఘర్షణలను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు గాయపడ్డారు.మహేస్తల హింసకు చెందిన కేసులో బెంగాల్ పోలీసులు ఇప్పటి వరకు 40 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ హింసకు చెందిన ఏడు ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి తన ఎక్స్ అకౌంట్‌లో ఈ హింసపై స్పందించారు. ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. మహేస్తలలోని వార్డు నెంబర్ 7లో శివాలయాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఆధీనంలో ఉన్న భూమిని అల్లరిమూకలు ఆక్రమించినట్లు పేర్కొన్నారు. ఆలయం వద్ద హిందువుల షాపులను, తులసీ కోటను ధ్వంసం చేశారని ఆరోపించారు.