బెంగళూరు : స్వీయ ప్రశంసలు మాని శత్రువులపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూచించారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ…ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ ప్రసంగాల గురించి ప్రస్తావించారు. మోడీ ఎన్నికల ప్రచారం నుండి తప్పుకోవాలని కోరారు. మోడీ వ్యాఖ్యలపై స్పందించడం తనకు ఇష్టంలేదని, కానీ అధికారంలో ఉన్న వారు నోరు అదుపులో పెట్టుకోవాలనేదే తన అభ్యర్థన అని అన్నారు. ప్రధానమంత్రి ఇటీవలి బహిరంగ ప్రకటనలు, రాజకీయ కార్యకలాపాలపై ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారల నుండి తప్పుకుని దేశంపై దృష్టి సారించండి అని అన్నారు. తాను తప్ప మరెవరూ అలా చేయరని గొప్పలు చెప్పుకునే బదులు శత్రులపై దృష్టి పెట్టాలని, రాజకీయ విభేదాలకు అతీతంగా తాను చెబుతున్నానని అన్నారు. భారత సాయుధ దళాలకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛా ఇచ్చామని ప్రధాని గతంలో చేసిన వాఖ్యలను ఖర్గే విమర్శించారు. సాయుధ దళాలకు పూర్తి అధికారం ఇచ్చామని చెప్పే మోడీ, తానే అంతా చేశానని ఎందుకు చెప్పుకుంటున్నారని అన్నారు. గొప్పలు చెప్పకోవడం మంచిది కాదు అని అన్నారు. సున్నితమైన సమయాల్లో రాజకీయ సంయమనం అవసరం అని తెలిపారు. గతంలో భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ పార్లమెంట్లో చూపిన సంయమనాన్ని ఉదహరిస్తూ… భారత్-పాక్ మధ్య ఘర్షణలు చెలరేగినప్పుడు, దేశానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదని పాకిస్తాన్ పార్లమెంటులో చర్చ జరిగిందని అన్నారు. సైన్యం ఉన్నంత వరకు అందరూ క్షేమమేనని, అందుకే తాము సాయుధ దళాలకు మద్దతు ఇస్తాము అన్నారు.