అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నిందితుల ప్రస్తుత రిమాండ్ గడువు ఈరోజు ముగియడంతో, సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, న్యాయమూర్తి నిందితుల రిమాండ్‌ను జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఈ ఉదయం సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా, కేసు దర్యాప్తు పురోగతిని తమకు తెలియజేయడం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిని సమగ్రంగా వివరిస్తూ లిఖితపూర్వక నివేదిక సమర్పించాలని దర్యాప్తు అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలో, తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, మానవతా దృక్పథంతో అరగంట పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారు.