హైదరాబాదు:జమ్మూకాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ జవాన్ సంపంగి నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధినిర్వహణలో ఉన్న సమయంలోనే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. జవాన్ నాగరాజు బలవన్మరణానికి పాల్పడిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషాదకర సంఘటన మూడు రోజుల క్రితమే జరిగిందని సమాచారం. మంగళవారం నాగరాజు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అధికారులు ఆయన తల్లిదండ్రులకు అప్పగించారు.దేశ సేవకు వెళ్లిన నాగరాజు విగతజీవిగా తిరిగి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా, కుమారుడు మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని నాగరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు ఆత్మహత్యకు గల కారణంపై స్పష్టత లేదు. నాగరాజు ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.