న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మపై.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఆ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో.. ఆయనపై కేసు నమోదు చేయాలని సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటీషనర్ కోరారు. అయితే ఆ అంశంపై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాషితో కూడిన ధర్మాసనం రియాక్ట్ అయ్యింది. పిటీషన్‌లో లోపాలు సవరిస్తే, మంగళవారం ఆ పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం పేర్కొన్నది. మాథ్యూస్ నెదుంపర అనే వ్యక్తి పిటీషన్ వేశారు. అయితే లోపాలను సవరిస్తానని, కానీ ఆ పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టాలని మాథ్యూస్ కోర్టును కోరారు. అత్యున్నత న్యాయస్థానం దానికి అంగీకారం తెలిపింది. మార్చి 14వ తేదీన .. హాళీ రోజు రాత్రి.. ఢిల్లీలో ఉంటున్న జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. స్టోర్‌రూమ్‌లో నోట్ల కట్టలను కాల్చివేసినట్లు ఆధారాలు కనిపించాయి. ఇంకా గుట్టలు గుట్టలుగా క్యాష్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ స్టోర్‌రూమ్‌ను అనేక మంది వాడుకుంటారని, తనకు క్యాష్‌తో సంబంధం లేదని చెప్పారు. అప్పుడు సీజేఐగా ఉన్న జస్టిస్ సంజీవి్ ఖన్నా.. జస్టిస్ వర్మపై దర్యాప్తునకు ఆదేశించారు. దాని ద్వారా రాజీనామా చేయాలని కోరారు. కానీ జస్టిస్ వర్మ రాజీనామాకు అంగీకరించకపోవడంతో ఆ విషయాన్ని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి లేఖ ద్వారా జస్టిస్ ఖన్నా తెలియజేశారు. నేరాభియోగం కింద తక్షణమే జస్టిస్ వర్మపై దర్యాప్తు చేపట్టాలని పిటీషన్‌లో మాథ్యూస్‌తో పాటు మరో ముగ్గరు డిమాండ్ చేశారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉన్నట్లు ఇన్‌హౌజ్ కమిటీ కూడా రిపోర్టు సమర్పించింది. ఇన్‌హౌజ్ విచారణ రిపోర్టు ఆధారంగా జస్టిస్ వర్మపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోరాడు.జస్టిస్ వర్మ రాజీనామాకు అంగీకరించకపోవడంతో.. ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేశారు. కేంద్రం దీనికి క్లియరెన్స్ ఇచ్చింది. కానీ అలహాబాద్, లక్నో బార్ సంఘాలు ఆయన ట్రాన్స్‌ఫర్‌ను వ్యతిరేకించాయి. జడ్జిగా ప్రమాణం చేసినా.. ఆయనకు ఎటువంటి జుడిషియల్ వర్క్‌ను అప్పగించలేదు.