అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణం (జూన్ 1) కంటే ముందుగా 27 నాటికి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని వాతావరణ విభాగం తెలుపుతుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులకు పూర్తిగా విస్తరించాయి. సాధారణం కంటే ఐదు రోజులు ముందుగానే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. నెలాఖరు నాటికి వేసవి దాదాపుగా ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా, తర్వాత మరింత బలపడుతుందని అంచనా. దీని ప్రభావంతో రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయని వివరిస్తుంది.