న్యూ ఢిల్లీ:పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకరంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ గట్టిగా దెబ్బకొట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో సుమారు 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమవగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, పంజాబ్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. భారత్ దాడులను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. తిరిగి దాడులు చేయనున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది.పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేయడంతో పాటూ బహిరంగ సభలపై ఆంక్షలు విధించారు. ఏక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే.. వెంటనే కాల్పులు జరపాలని సరిహద్దు భద్రతా దళ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.