న్యూఢిల్లీ: పంజాబ్‌లో అనేక మంది సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారని రైతు నాయకులు విమర్శించారు. శంభు పోలీస్ స్టేషన్ వెలుపల తమ నిరసనకు ముందే ఎస్‌కెఎం నేత జగ్జిత్ సింగ్ దల్లెవాల్ సహా అనేక మంది నాయకులను పంజాబ్ ప్రభుత్వం సోమవారం గృహ నిర్బంధంలో ఉంచిందని రైతు నాయకులు పేర్కొన్నారు. శంభు, ఖనౌరి ప్రాంతాల్లో రైతుల ఆందోళన జరగకుండా అణచివేత పద్ధతులను ఉపయోగించారని ఆరోపిస్తూ పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 6 (మంగళవారం)న ఎస్‌కెఎం ఆందోళనకు పిలుపునిచ్చింది. పంజాబ్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున ఎస్‌కెఎం నేతల ఇళ్లకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారని రైతు నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఆందోళన కోసం ప్రజలను సమీకరించకుండా పోలీసులు వారిని నిరోధించాలనుకుంటున్నారని విమర్శించారు. ‘ఫరీద్‌కోట్ జిల్లాలోని తన ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దల్లెవాల్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు’ అని ఒక రైతు నాయకుడు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అనేక మంది రైతు నాయకులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో మంజిత్ సింగ్ రారు, దవీందర్ సింగ్ లాంటి రైతు నేతలు ఉన్నారు.రైతుల ఆందోళనల నుండి తమను వెళ్ళగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అణచివేత పద్ధతులను ఉపయోగించిందని, రైతులను ఇళ్లకు వెళ్ళగొట్టినప్పుడు వారి వస్తువులను దొంగిలించారని ఎస్‌కెఎం విమర్శించింది. రైతుల వస్తువులను దొంగిలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ అణచివేత పద్ధతులను వ్యతిరేకిస్తూ, రైతుల వస్తువుల దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం శంభు పోలీస్ స్టేషన్ వెలుపల శాంతియుత ఆందోళన చేపట్టనున్నట్లు ఎస్‌కెఎం ఇటీవల ప్రకటించింది. అయితే ఈ ఆందోళనను అణచివేసేందుకు పంజాబ్ ప్రభుత్వం రైతు నేతలను గృహ నిర్బంధం విధించింది.ఈ సందర్భంగా దల్లెవాల్ సోషల్ మీడియాలో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. ‘నేను ఇప్పటికీ బలహీనంగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను నడవలేను. అయినప్పటికీ పోలీసులు నన్ను నా ఇంటికి పరిమితం చేశారు’ అని దల్లెవాల్ అన్నారు. రైతులు శంభు పోలీస్ స్టేషన్ వెలుపల ఒకరోజు శాంతియుత నిరసనను ప్రకటించారని, కానీ ప్రభుత్వం ‘భయపడి’ వారిని అనుమతించడం లేదని దుయ్యబట్టారు. గతంలో చాలా మంది రైతు నాయకులు, రైతులకు భారీ నష్టం వాటిల్లిందని, ఎందుకంటే వారి ట్రాలీలు, ఇతర వస్తువులు శంభు, ఖనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద దొంగిలించబడ్డాయని అన్నారు. కోల్పోయిన వస్తువులను రైతులు తిరిగి పొందలేదని పేర్కొన్నారు. రైతుల వస్తువులు దొంగతనానికి గురైనందున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర పోలీసులు హామీ ఇచ్చారని, కానీ అమలు చేయలేదని దల్లెవాల్ విమర్శించారు. ‘నిందితులపై సత్వర చర్యలు తీసుకునే బదులు, చోరీకి గురైన రైతుల వస్తువులను గుర్తించడంలో సహాయం చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మే 6న మేము నిరసనకు పిలుపునిచ్చినప్పుడు, ప్రభుత్వం చాలా భయపడి మమ్మల్ని అక్కడకు చేరకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకుంది’ అని దల్లెవాల్ విమర్శించారు.