రెండోరోజు ఈడీ ఎదుట రాబర్ట్‌ వాద్రా

దిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. గురువారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న వాద్రాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఈడీ అధికారులు ఆయనను 5.30గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.లండన్‌లోని 12, బ్రైన్‌స్టన్‌ స్క్వేర్‌లో 1.9 మిలియన్‌ పౌండ్లు (రూ.17.62 కోట్లు)తో భవనం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ వాద్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా దిల్లీ హైకోర్టు అందుకు అంగీకరించింది. ఫిబ్రవరి 16వరకు వాద్రాను అరెస్టు చేయకూడదని ఆదేశించింది. అయితే కేసు విచారణ నిమిత్తం ఈడీ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు వాద్రాకు సూచించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట భార్య ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. వాద్రా లోపలకు వెళ్లగానే ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోయారు.రాబర్ట్‌ వాద్రాను ఈడీ దాదాపు అయిదున్నర గంటల పాటు విచారించింది. దాదాపు 40 ప్రశ్నలు వేసి లిఖిత పూర్వకంగా సమాధానాలు తెలుసుకొంది. జాయింట్‌ డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌, మరో అయిదుగురు అధికారులు విచారించారు. తనకు లండన్‌లో ఎలాంటి ఇల్లులేదని వాద్రా చెప్పినట్టు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos