అమరావతి : ఎపి, తెలంగాణ రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్న వేళ … చల్లటి వార్త ఉపశమనాన్ని కల్పిస్తుంది. వరుసగా మూడు రోజులపాటు వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుండి మూడు రోజులపాటు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు వస్తాయని, వడగళ్ల వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మూడు రోజుల పాటు వర్షాలు
వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఇప్పటికే ఎండలు మండుతున్న సమయంలో వర్షాలు కురిస్తే మరింత వేడి పెరిగే ప్రమాదం ఉంటుంది అని ప్రజలలో ఆందోళన కూడా కొనసాగుతుంది. మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వర్షాల నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిజానికి ఈ సమయంలో వర్షం కురువకూడదు. ఇప్పుడిప్పుడే వరికంకులు వస్తున్న సమయం, అలాగే మామిడి వంటి ఉద్యాన పంటలు పూత, పిందే వేస్తున్న సమయం. ఈ సమయంలో వర్షాలు కురిస్తే పంటలు బాగా దెబ్బతింటాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా ఒకటి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల ప్రజలు జాగ్రత్త అని సూచిస్తున్నారు.
ఈ జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన తుఫాన్లు
మార్చి 22వ తేదీ మరియు మార్చి 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్ లలో ఈదురు గాలులతో కూడిన తుఫానుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇక హైదరాబాద్ నగరం తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ జిల్లాలలో వడగండ్ల వాన
నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ, యాదాద్రి, సూర్యపేట, రంగారెడ్డి, మేడ్చల్, నల్గండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో వడగండ్ల వానలు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.