చెన్నై : శనివారం వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం తెస్తున్న డిలిమిటేషన్ ప్రక్రియపై స్పందించారు. రాష్ట్ర హక్కులకు న్యాయమైన డిలిమిటేషన్ చాలా కీలకం. కేవలం ఎంపిల సంఖ్యకు మాత్రమే కాదు.. రాష్ట్ర హక్కులకు కూడా ఇది ఎంతో కీలకం అని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.కాగా, ‘ప్రస్తుతం డిలిమిటేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. డిఎంకె ఈ విషయంపై ఎందుకింత ప్రత్యేక దృష్టిసారిస్తోందంటే..2026లో డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనాభా ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే పార్లమెంటులో మన (దక్షిణాది రాష్ట్రాలు) ప్రాతినిధ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఇది కేవలం ఈ అంశం ఎంపీల సంఖ్య గురించి మాత్రమే కాదు.. మన రాష్ట్ర హక్కుల గురించి కూడా. అందుకే మేము బిజెపి తప్ప మిగిలిన అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాము. డిలిమిటేషన్‌పై మిగిలిన అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉన్నాయి’ అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు డిలిమిటేషన్కు వ్యతిరేకంగా ఉమ్మడిగా గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మార్చి 22వ తేదీన చెన్నైలో జరుగుతున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని సమాఖ్యవాదంపై జరుగుతున్న దాడికి ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.