రెండేళ్లలో 38 విదేశీ పర్యటనలు చేపట్టిన ప్రధాని మోదీ.. రూ.258 కోట్ల ఖర్చు

రెండేళ్లలో 38 విదేశీ పర్యటనలు చేపట్టిన ప్రధాని మోదీ.. రూ.258 కోట్ల ఖర్చు

న్యూ ఢిల్లీ : ప్రధాని మోదీ  విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 2022 నుంచి 2024 డిసెంబర్‌ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు తెలిపింది. ఈ పర్యటనలకు గానూ రూ.258 కోట్లు ఖర్చైనట్లు ప్రకటించింది. గత మూడేళ్లలో విదేశీ పర్యటనలకు మోదీ వెళ్లినప్పుడు వివిధ ఏర్పాట్ల కోసం అక్కడి దౌత్య కార్యాలయాలు ఎంత ఖర్చు చేశాయో వెల్లడించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖర్గే ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 మే నుంచి 2024 డిసెంబర్‌ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు తెలిపారు. ఈ పర్యటనలకు గానూ రూ.258 కోట్లు ఖర్చైనట్లు వెల్లడించారు. 2022-24 మధ్య ప్రధాని మోదీ అమెరికా, జపాన్‌, జర్మనీ, కువైట్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, యూఏఈ, నేపాల్‌‌, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్‌, దక్షిణాఫ్రికా, గ్రీస్‌, పోలాండ్‌, ఉక్రెయిన్‌, రష్యా, ఇటలీ, బ్రెజిల్‌, గయానాలో పర్యటించారు. 2022 మేలో ప్రధాని తన విదేశీ పర్యటనను జర్మనీతో ప్రారంభించారు. 2024 డిసెంబర్‌లో కువైట్‌తో తన పర్యటనలు ముగిశాయి. ఇందులో అత్యధికంగా 2023 జూన్‌లో జ‌రిగిన అమెరికా ప‌ర్యట‌న‌కు రూ.22కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గతేడాది సెప్టెంబరులో మోదీ అమెరికా వెళ్లినప్పుడు రూ.15.33 కోట్లు ఖర్చు అయినట్లు పేర్కొంది. ఇక మే 2022లో ప్రధాని నేపాల్‌ పర్యటనకు రూ.80 లక్షలు, మే 2023లో జపాన్‌ పర్యటనకు రూ.17.19 కోట్లు ఖర్చైనట్లు వివరించింది. ఇక 2014కి ముందు అప్పటి ప్రధానులు చేసిన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. 2011లో అప్పటి ప్రధాని అమెరికా పర్యటనకు రూ.10.74 కోట్లు ఖర్చైనట్లు తెలిపారు. అదే ఏడాది ఫ్రాన్స్‌ సందర్శనకు రూ.8.33 కోట్లు, 2013లో రష్యా సందర్శనకు రూ.9.95 కోట్లు, 2013లో జర్మనీ పర్యటనకు రూ.6 కోట్లు ఖర్చైనట్లు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos