
ప్రభుత్వ పథకాలు ప్రజల్లో బాగా క్లిక్ అయ్యాయని, జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్, వైసీపీ నేతలకు సిద్ధాంతాలు, విలువలు లేవని విమర్శించారు. మైలవరం పోలీసులను ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డంగా దొరికిపోయారన్నారు. అక్రమాల ద్వారా అధికారంలోకి రావాలని వైసీపీ నేతల ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇప్పటి నుంచే డబ్బు సంచులు బయటకు తీస్తున్నారని, వైసీపీ వ్యవహారాలపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని నేతలకు సీఎం సూచించారు. డబ్బులు, అమలుకాని హామీలు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకిరావడం గోడమీద రాసిన సత్యమని చెప్పారు. 10, 11న హోదా, విభజన హామీలపై నిరసనలు తెలపాలని కార్యర్తలకు దిశానిర్దేశం చేశారు. 11న ఢిల్లీ దీక్షలో నేతలందరూ పాల్గొనాలని ఆదేశించారు. రాజకీయ ప్రత్యర్థులపై మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చివరికి సోనియా అల్లుడు వాద్రాను కూడా ఈడీ విచారణకు పిలిపించారన్నారు. అన్ని వ్యవస్థలను మోదీ భష్టుపట్టిస్తున్నారని టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు విమర్శలు గుప్పించారు.