అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే సీపీఎస్ పెన్షన్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఛలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేయటంపై నిరసన తెలియజేశారు. అయితే వాయిదా తీర్మానం కూడా లేకుండా ఆందోళన చేయటం సరికాదని చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తమ ఆందోళనను విరమించలేదు. వెల్లోకి దూసుకెళ్లి అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రితో సమావేశం ఏర్పాటు చేయిస్తానని చైర్మన్ హామీ ఇచ్చినప్పటికీ ఎమ్మెల్సీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పినా సభ్యులు వెనక్కి తగ్గలేదు.