తొలి టీ20లో భారత్ చిత్తు

తొలి టీ20లో భారత్ చిత్తు

వెల్లింగ్టన్‌: టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌కు శుభారంభం. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అన్ని విభాగాల్లో 100 శాతం కష్టపడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు టిమ్‌ సీఫెర్ట్‌ (84; 43 బంతుల్లో 7×4, 6×6), కొలిన్‌ మన్రో (34; 20 బంతుల్లో 2×4, 2×6) కోరుకున్న ఆరంభాన్ని అందించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో పటిష్ఠ భారత్‌ ముందు 220 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది కివీస్‌. ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌ (34; 22 బంతుల్లో 3×4) కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు చేజార్చుకున్నా చివర్లో రాస్ టేలర్‌ (23; 14 బంతుల్లో 2×4), కుగులీన్‌ (20; 7 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు మెరిపించారు. హార్దిక్‌ పాండ్య 2, భువి, ఖలీల్‌, కృనాల్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు. ఛేదనకు దిగిన భారత ఆటగాళ్లు అత్యంత ఉదారంగా ప్రవర్తించారు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ 5 పరుగుల్లోపే పెవిలియన్‌ చేరారు. ఎంఎస్‌ ధోనీ (39; 31 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. విజయ్‌ శంకర్ (27; 18 బంతుల్లో 2×4, 2×6)‌, శిఖర్‌ ధావన్‌ (29; 18 బంతుల్లో 2×4, 3×6) కాస్త కష్టపడ్డారు. కృనాల్‌ పాండ్య (20; 18 బంతుల్లో 1×4, 1×6) కాసేపు ధోనీకి సహకారం అందించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేశారు. పరుగులు చేయాలన్న ఆత్రుతలో పంత్‌, శంకర్‌, దినేశ్‌ కార్తీక్‌, పాండ్య అనవసర షాట్లు ఆడారు. వికెట్లు పడుతుండటంతో చేయాల్సిన రన్‌రేట్‌ 22కు చేరింది. కివీస్‌ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో రోహిత్‌ సేన 80 పరుగుల తేడాతో టీ20ల్లో పరుగుల పరంగా అత్యంత ఘోర ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాండ్య సోదరులు ఇద్దరూ ఆడటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos