భారత దౌత్యానికి పరీక్ష

న్యూఢిల్లీ : సరైన పత్రాలు లేని భారత వలసదారులతో కూడిన మరో విమానం నేడు (శనివారం) అమృత్‌సర్‌కు చేరుకోనుంది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారతీయుల్ని ఖైదీల మాదిరిగా కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి స్వదేశానికి పంపడంపై ఆయన కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది భారత దౌత్యానికే పరీక్ష వంటిదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘నేడు అమృత్‌సర్‌కి భారతీయులున్న మరో విమానం రానుంది. ఈసారి కూడా వారి కాళ్లకు చేతులకు సంకెళ్లు వేస్తారా? అని అందరి దృష్టి ఆ విమానంపైనే ఉంది. భారత్‌ అమెరికాతో ఎన్నో ఏళ్లుగా దౌత్య సంబంధాలు నెరుపుతుంది. అయినప్పటికీ ఇది భారత దౌత్యానికి పరీక్ష’ అని చిదంబరం తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన అమెరికా విమానం ద్వారా 104 మంది భారతీయులు అమృత్‌సర్‌కు చేరుకున్నారు. భారతీయుల బహిష్కరణ విషయంలో భారత విదేశాంగ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చిదంబరం తీవ్రంగా విమర్శించారు. సరైన పత్రాలు లేని భారతీయుల బహిష్కరణకు సంబంధించిన సమాచారం అమెరికా ప్రభుత్వం ఉందని ముందే తెలిసినప్పుడు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖా మంత్రి ఎస్‌. జై శంకర్‌ ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమైనప్పుడు అక్కడి నుంచి భారతీయుల్ని పంపే అంశాన్ని ఆయన లేవనెత్తారా? అని చిదంబరం ప్రశ్నించారు. మరో 483 మంది భారతీయులను వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం విమానాలను పంపుతుందా? అని చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos