న్యూఢిల్లీ : దేశ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోవడంతో తయారీ రంగం వెలవెల పోతోంది. సరుకులకు డిమాండ్ తగ్గడంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) నాలుగు నెలల కనిష్టానికి పడిపోయినట్లు స్వయంగా ప్రభుత్వ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఏడాది 2024 డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 3.2 శాతానికి పడిపోయిందని బుధవారం కేంద్ర గణంకాల శాఖ తెలిపింది. ఇంతక్రితం నవంబర్లో 5 శాతంగా నమోదయ్యింది. ఇదే నెలలో తయారీ రంగంలో 5.8 శాతం పెరుగుదల ఉండగా.. డిసెంబర్లో 3 శాతానికి పరిమితమవడం ఆందోళనకరం.నవంబర్లో 1.9 శాతం పెరిగిన గనుల రంగం.. డిసెంబర్లో 2.6 శాతం వృద్ధిని కనబర్చింది. విద్యుత్ ఉత్పత్తి 4.4 శాతం నుంచి 6.2 శాతానికి పెరిగింది. మౌలిక వసతులు, నిర్మాణ రంగ ఉత్పత్తులు నవంబర్లో 8.1 శాతం వృద్ధిని సాధించగా.. డిసెంబర్లో 6.3 శాతానికి తగ్గాయి. జనవరికి సంబంధించిన ఐఐపి గణంకాలను మార్చ్ 12న విడుదల చేయనున్నారు.ఈ ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 4.31 శాతంగా చోటు చేసుకుంది. 2024 డిసెంబర్లో ఇది 5.22 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన నెలలో అహారోత్పత్తుల ధరలు 6 శాతంగా ఉండగా.. ఇంతక్రితం నెలలో 8.4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. జనవరిలో ముఖ్యంగా కొబ్బరి ఆయిల్ 54.2 శాతం, ఆలు 49.6 శాతం, కొబ్బరి 38.7 శాతం, అల్లం 30.7 శాతం, బటానీలు 30.2 శాతం చొప్పున పెరగడం గమనార్హం.