న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు ఉచిత వాగ్ధానాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఉచిత ప్రకటనలు సరికాదు అని పేర్కొన్నది. ఆ విధానాన్ని కోర్టు వ్యతిరేకించింది. ఉచిత రేషన్, డబ్బు అందడం వల్ల.. ప్రజలు ఎవరూ పనిచేయడానికి ఇష్టపడడం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలు చేస్తున్న ఉచిత వాగ్ధానాలను సుప్రీంకోర్టు నిలదీసింది. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, సమాజంలో ప్రజల పాత్రను పెంచాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరణణి వాదిస్తూ.. పట్టణాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇండ్లు లేని వారి కోసం షెల్టర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన స్కీమ్ ఎప్పటి నుంచి అమలు అవుతుందో కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలని అటార్నీ జనరల్‌ను సుప్రీం కోర్టు కోరింది. జస్టిస్ బీఆర్ గవాయి, ఆగస్టిన్ జార్జ్ మాషిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. షెల్టర్ హోమ్స్ గురించి దాఖలైన పిటీషన్‌పై విచారిస్తూ కోర్టు ఇలా వ్యాఖ్యానించింది. ఫ్రీ రేషన్ వస్తోందని, పని చేయకుండానే పైసలు వస్తున్నాయని జస్టిస్ గవాయ్ తెలిపారు. ప్రజల పట్ల ఉన్న శ్రద్దను మెచ్చుకుంటున్నామని, కానీ వాళ్లను పనిచేసేలా తయారు చేయవద్దు అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. మరో ఆరు వారాల తర్వాత కేసుపై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.