న్యూఢిల్లీ: ఎల్‌ఐసీలో వంద శాతం ఎఫ్‌డీఐను వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగం సంస్థ అయిన ఎల్‌ఐసీని దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. అలాగే ఎల్‌ఐసీ ఏజెంట్లకు ఇచ్చే పాలసీ కమిషన్‌ను పెంచాలన్నారు. మంగళవారం ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీఏఓఐ) ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ జరిగింది. ఎంపీలు బికాస్ రంజన్ భట్టాచార్య, జాన్ బ్రిట్టాస్, వి శివదాసన్, ఎ.ఎ రహీం, సీహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తపన్‌సేన్ మాట్లాడుతూ 1938లో నిర్ణయించిన ఏడు శాతం కమిషన్ ఇప్పటికీ ఇస్తున్నారని దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. తక్కువ ఆదాయ వర్గాలకు బీమా కవరేజ్ ఉండేలా కనీస పాలసీ మొత్తాన్ని రూ.25 వేలకు పెంచడం దారుణమన్నారు. ఎల్‌ఐసీ, పాలసీదారుల మధ్య లావాదేవీలను ఆదాయపు పన్ను, జీఎస్‌టీ నుంచి మినహాయించాలన్నారు. ఎల్‌ఐసీ వడ్డీ రేట్లను తగ్గించేలా ఆదేశించాలని, ఏజెంట్లకు ఉపాధి రక్షణ కల్పించడానికి పార్లమెంటులో బిల్లును ఆమోదించాలని, ఎల్‌ఐసీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఎల్‌ఐసీఏఓఐ అధ్యక్షుడు సుర్జిత్ కుమార్ బోస్ మాట్లాడుతూ దేశంలో ఉన్న 14 లక్షల మంది ఎల్‌ఐసీ ఏజెంట్లకు ఉపాధికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి గతంలోనే సీపీఐ(ఎం) ఎంపీ బాసుదేవ ఆచార్య పార్లమెంట్‌లో ప్రయివేట్ మెంబర్ బిల్లు పెట్టారని, దాన్ని చర్చకు పెట్టి ఆమోదించాలని కోరారు. అలాగే ఎల్‌ఐసీ పాలసీ తీసుకునే వయో పరిమితి 60 ఏండ్ల నుంచి 80 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ కోశాధికారి ఎం. సాయిబాబు, కార్యదర్శి కె ఎన్ ఉమేష్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాలు ఆందోళనలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఐక్యం పోరాటాలతోనే కేంద్రం మెడలు వంచగలమని వెల్లడించారు. ఎల్‌ఐసీఓఐ ప్రధాన కార్యదర్శి పి.జి. దిలీప్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. మంజునాథ్, అఖిల భారత ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ ఎ. సంపత్, ఎ.వి. బెల్లర్మిన్, సోమనాథ్ భట్టాచార్య, ఎం. సెల్వరాజ్, ప్రణవ్ శర్మ, మనోరంజన్ సర్కార్, గౌరీనంధి, తెలంగాణకు చెందిన తన్నీర్ కుమార్, రాంనరసయ్య, టి.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సావిత్రి, పి.ఎన్. సుధాకరన్, ఎల్. నరసింహారావు, రవికుమార్, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ నవీన్‌చంద్ తదితరులు మాట్లాడారు.