న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సీలింగ్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేసిందని, ఇప్పుడు ఏ సీలింగ్ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం బీసీలను మోసం చేయడమేనని ఆర్. కృష్ణయ్య విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ప్రకటించారని, ఇప్పుడు తప్పించుకోవడానికి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ఆరోపణలు చేశారు.