చెన్నై : జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) వ్యతిరేకించి నందుకు మోడీ ప్రభుత్వం తమ రాష్ట్రంపై ‘ఓపెన్ బ్లాక్మెయిల్’, నిర్బంధం, రాజకీయ ప్రతీకారానికి దిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.2,152 కోట్లను లాక్కొని, ఇతర రాష్ట్రాలకు పంచిపెట్టిందని ఆదివారం సోషల్మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం-2020, మూడు భాషల పాలసీని తమిళనాడు వ్యతిరేకించడంతో కేంద్రం బహిరంగ బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని వివరించారు. తమిళనాడుపై బీజేపీ అన్యాయానికి హద్దులు లేకుండా పోయాయని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. విద్యార్థులకు కేటాయించిన రూ.2,152 కోట్లు లాక్కొని, ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టిందని పేర్కొన్నారు. ఇది నిర్బంధం కాక మరొకటి కాదనీ, విద్యార్థుల హక్కులకు మద్దతుగా పోరాడినందుకు వారిని శిక్షించడం తగదని వివరించారు. ఒక రాష్ట్రంపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇంత నిర్దాక్షిణ్యంగా విద్యార్థుల గొంతు నొక్కలేదని సీఎం పేర్కొన్నారు. తమిళనాడు, ఆ రాష్ట్ర ప్రజల పట్ల విద్వేషం ఉందని ఈ చర్యతో బీజేపీ మరోసారి నిరూపించుకుందని వివరించారు.