హైదరాబాదు:సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో సుమారు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు.ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని అన్నారు. పకడ్బందీగా సర్వే నిర్వహించి సమాచారం సేకరించామని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేస్తుందని ఆయన అన్నారు.దీనితో, కులగణనపై ప్రధానమంత్రిపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతి పక్షానికి చిత్త శుద్ధి లేదని ఆయన అన్నారు.