పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. లోక్‌సభలో గందరగోళం

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. లోక్‌సభలో గందరగోళం

న్యూ ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా శనివారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ సమర్పించిన అనంతరం ఉభయసభలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో ఇటీవలే తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చర్చించాలని విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టాయి. వెల్‌లోకి వచ్చిన విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మృతుల జాబితాను విడుదల చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత మరణాలను ధృవీకరించడంపై సందేహం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సభలో ఎంపీల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభను సజావుగా నడిపేందుకు ప్రతిపక్షాలు ఇష్టపడటం లేదంటూ మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos