న్యూ ఢిల్లీ:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని పూర్తి చేశారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. ముఖ్యంగా బీహార్‌పై వరాల జల్లు కేటాయించారు. పలు కేటాయింపులు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఎలాంటి ప్రత్యేక పథకాలను ప్రకటించలేదు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో బీహార్ జేడీయూతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ కూడా కీలక భాగస్వామి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి కేటాయింపులూ జరగలేదని, అధికారంలో కీలకంగా ఉన్న ఏపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ పేర్కొన్నారు. “ఏడాది తర్వాత బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇది సహజం. అయితే ఎన్డీఏకు మరో మూలస్తంభం అయిన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు చాలా క్రూరంగా విస్మరించారు“ అని జైరాం రమేశ్ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. ఆ తర్వాత వరుస ట్వీట్ల ద్వారా బడ్జెట్‌పై విమర్శలను ఎక్కుపెట్టారు.“దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగు సంక్షోభాలతో బాధపడుతోంది – 1), స్థిరమైన వాస్తవ వేతనాలు, 2) వినియోగదారులకు ఇబ్బందులు 3) ప్రైవేట్ పెట్టుబడుల మందగమన రేట్లు 4 ) సంక్లిష్టమైన జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) వ్యవస్థ. ఈ జబ్బులను పరిష్కరించడానికి బడ్జెట్ ఏమీ చేయలేదు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఉపశమనం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి“ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.