న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. పలుచోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు.. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఢిల్లీలో జనవరి 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని, జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే, ఢిల్లీ నుంచి వెళ్లే, అక్కడి వచ్చే రైలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైలు సర్వీసులను రద్దు చేసినట్టు కూడా అధికారులు తెలిపారు. మరోవైపు … తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కారణంగా చలి తీవ్రత పెరిగింది. ఇదిలా ఉండగా … తెలంగాణలో కూడా చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు.