మనుస్మృతి దహనం చేశారంటూ 13 మంది విద్యార్థుల అరెస్టు

మనుస్మృతి దహనం చేశారంటూ 13 మంది విద్యార్థుల అరెస్టు

లక్నో : మనుస్మృతి దహనం చేశారనే ఆరోపణలతో వారణాసిలో బనారస్‌ హిందూ యూనివర్శిటీ (బిహెచ్‌యు)కి చెందిన 13 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు విద్యార్థినులు. వీరికి వారణాసి జిల్లా కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. మనుస్మృతి దహన్‌ దివస్‌ సందర్భంగా ఈ నెల 25న మనుస్మృతిని బిహెచ్‌యులో భగత్‌సింగ్‌ స్టూడెంట్స్‌ మోర్చా (బిఎస్‌ఎం)కు చెందిన విద్యార్థులు దగ్ధం చేశారు. 1927లో డిసెంబరు 25న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మనుస్మృతిని దహనం చేసిన సందర్భంగా ఏటా అదే తేదీని ‘మనుస్మృతి దహన్‌ దివస్‌’గా నిర్వహిస్తున్నారు. బిహెచ్‌యు భద్రతా అధికారి ఓం ప్రకాష్‌ తివారీ ఈ నెల 26న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లంక పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. విద్యార్థులు అధ్యాపకులపై, భద్రతా సిబ్బందిపై దాడి చేశారని, ఇతర విద్యార్థులతో ఘర్షణకు దిగారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బిఎన్‌ఎన్‌లోని తీవ్ర నిబంధనలు సెక్షన్‌ 132 (ప్రభుత్వ ఉద్యోగులను వారు విధుల నిర్వర్తించకుండా నిరోధించండం, దాడి చేయడం), సెక్షన్‌ 196(1) (మతం, జాతి, పుట్టిన ప్రాంతం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్‌ 299 (మత విశ్వాసాలను అవమానించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టడం) వంటి వాటితో కేసు నమోదు చేశారు. ఇందులో కొన్ని సెక్షన్ల ప్రకారం కనీసం పదేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసులో ముఖేష్‌ కుమార్‌, సందీప్‌ జైస్వాల్‌, అమర్‌ శర్మ, అరవింద్‌ పాల్‌, అనుపమ్‌ కుమార్‌, లక్ష్మణ్‌ కుమార్‌, అవినాష్‌, అరవింద్‌, శుభం కుమార్‌, ఆదర్స్‌, ఇప్సితా అగర్వాల్‌, సిద్ధి తివారీ, కాత్యాయని బి రెడ్డిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు వీరికి కస్టడీ విధించడంతో చౌకాఘాట్‌లోని జిల్లా జైలుకు తరలించారు. అక్కడ వీరిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఎటిఎస్‌) బృందం విచారణ చేస్తోంది.

విద్యార్థుల అరెస్టులపై బిఎస్‌ఎం ఖండన

విద్యార్థుల అరెస్టును బిఎస్‌ఎం తీవ్రంగా ఖండించింది. బ్రాహ్మణీయ, హిందూత్వ శక్తుల ఆదేశంతో జరిగిన అణచివేత చర్యగా విమర్శించింది. యూనివర్శిటీ సిబ్బంది చేసిన కల్పిత ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. విద్యార్థుల నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, వారి కుటుంబ సభ్యులకు అరెస్టు సమాచారం కూడా ఇవ్వలేదని, ఇది సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos