చరిత్రను వక్రీకరించే యత్నమిది

చరిత్రను వక్రీకరించే యత్నమిది

శ్రీనగర్‌ : షేక్‌ మహ్మద్‌ అబ్దుల్లా జయంతి, అమరవీరుల దినోత్సవాలను సెలవు దినాలుగా రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం విమర్శించింది. ఈ నిర్ణయాన్ని చరిత్రను వక్రీకరించే యత్నంగా సిపిఎం నేత, కుల్గామ్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి విమర్శించారు. స్వాతంత్య్రోద్యమానికి, జమ్మూ కాశ్మీర్‌ ప్రజల సాధికారత కోసం షేక్‌ మహ్మద్‌ అబ్దుల్లా చేసిన సేవలను విస్మరించరాదని ఆయన పేర్కొన్నారు. మహిళల సాధికారత, అందరికీ విద్య, నష్టపరిహారం లేకుండా దున్నేవాడికే భూమి వంటి నిర్ణయాల ద్వారానే ప్రజలకు సాధికారత లభించిందని, ఇవన్నీ వారు సాగించిన ఉద్యమాల ద్వారానే వచ్చాయని తరిగామి పేర్కొన్నారు. అంతటి మహోన్నతుడిని ఇలా అప్రతిష్టపాల్జేయడమంటే చరిత్రను వక్రీకరించడమేనని ఆయన విమర్శించారు. 2025 కేలండర్‌ సంవత్సరంలో సెలవు దినాల జాబితా నుండి జులై 13, డిసెంబరు 5వ తేదీలను తొలగించడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జులై 13 అంటే జమ్మూ కాశ్మీర్‌కు చారిత్రక ప్రాధాన్యత చాలా వుందన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తమ జీవితాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకునే రోజు అది అని చెప్పారు. అలాగే డిసెంబరు 5 షేక్‌ సాహిబ్‌ జయంతి అని, అది కూడా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడం ద్వారా, నయా కాశ్మీర్‌ మేనిఫెస్టోలో భాగంగా సమూలంగా భూ సంస్కరణలను అమలు చేయడం, ఉచిత విద్యను ప్రవేశపెట్టడం, మహిళలకు సాధికారత కల్పించడం ద్వారా షేక్‌ సాహిబ్‌ ఆయన సహచరులు గొప్ప సేవలందించారని కొనియాడారు. అటువంటి కీలకమైన మైలు రాళ్ళను మన స్మృతిపథం నుండి చెరిపివేయడానికి చేసే యత్నాల వల్ల వారు ఏ విలువలకైతే ప్రాతినిధ్యం వహించారో ఆ విలువలు దెబ్బతింటాయన్నారు. ఇలా చరిత్రను వక్రీకరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఒనగూడవన్నారు. ప్రజలను మరింతగా చీల్చడానికే ఈ ప్రయత్నాలు పనికొస్తాయన్నారు. ఇటువంటి నిర్ణయాల ద్వారా జమ్మూ కాశ్మీర్‌ ప్రజలను ప్రభుత్వం అవమానపరుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఇటువంటి విచ్ఛిన్నకర ఎజెండాను సమైక్యంగా ప్రతిఘటించాల్సిందిగా జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌ ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos