పోలీస్‌ స్టేషన్‌లో దళితుడి అనుమానాస్పద మృతి

పోలీస్‌ స్టేషన్‌లో దళితుడి అనుమానాస్పద మృతి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లా సత్వారా పోలీస్‌ స్టేషన్‌లో ఓ దళిత వ్యక్తి అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వ్యక్తి అత్యహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా, లేదు.. డిమాండ్‌ చేసిన లంచం ఇవ్వలేదని పోలీసులే హత్య చేశారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు వెల్లడించిన వివరాల కోసం ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా 35 ఏళ్ల ముఖేష్‌ లాంగ్రేను సత్వారా పోలీస్‌ స్టేషన్‌కు ఈ నెల 26న పిలిపించారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన కొద్ది సేపటికే ముఖేష్‌ మరణించాడు. స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకోవడానికే పిలిచామని, కస్టడీలోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ కిటికీకి స్కార్ఫ్‌తో ఆత్యహత్య చేసుకోవడాన్ని చూసి వెంటనే ఆసుపత్రికి తరలించామని, అక్కడ వైద్యులు ముఖేష్‌ మృతి చెందినట్లు ధ్రువీకరించారని పోలీసులు చెబుతున్నారు.

దారుణాలకు బిజెపి ప్రభుత్వానిదే బాధ్యత : కాంగ్రెస్‌

ఈ ఘటనకు మోహన్‌ యాదవ్‌ ప్రభుత్వానిదే బాధ్యతని, ప్రభుత్వ మద్దతు లేకుండా ఇలాంటి దారుణం సాధ్యం కాదని కాంగ్రెస్‌ నాయకులు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఒక దళిత యువకుడు పోలీసు కస్టడీలో హత్యకు గురయ్యాడు. ఒడిశాలోని బాలాసోర్‌లో గిరిజన మహిళలను చెట్లకు కట్టేసి కొట్టారు. ఈ రెండు సంఘటనలు విచారకరం, అవమానకరం, తీవ్రంగా ఖండించదగినవి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి ప్రభుత్వ మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు’ అని రాహుల్‌ విమర్శించారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని భీమ్‌ ఆర్మీ కార్మికులు డిమాండ్‌ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos