8న ప్రధాని పర్యటనను అడ్డుకోండి

8న ప్రధాని పర్యటనను అడ్డుకోండి

విశాఖ : పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి జనవరి 8న వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో దీనికి ముందే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తామని, సొంతగనులు కేటాయించి పూర్తి సామర్ధ్యంతో ప్రభుత్వ ఆధీనంలోనే నడుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. లేకపోతే మోడీ పర్యటనను సిపిఎం అడ్డుకుం టుందని తెలిపారు. విశాఖ ప్రజలు, కార్మికులు కూడా ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో అనేక సందర్భాల్లో ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పటికీ విశాఖ ఉక్కు పరిశ్రమపై స్పష్టమైన ప్రకటన చేయకుండా తప్పించుకున్నారని గుర్తు చేశారు. విశాఖ రైల్వే జోన్‌ విషయంలోనూ వాగాడంబరం తప్ప ఆచరణ లేదన్నారు. పెందుర్తి సుజాత నగర్‌లో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.గంగారావు, బి.జగన్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.రమణి, బి.వెంకటరావులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. నరేంద్ర మోడీ విశాఖ వచ్చినప్పుడల్లా స్టీల్‌ ప్లాంట్‌ విష యంలో మౌనంగా ఉంటున్నారని, ప్రైవేటీకరణకు కావలసిన పనులన్నీ చాప కింద నీరులా చేసుకుం టూ పోతున్నారని అన్నారు. టిడిపి, బిజెపి, జనసేన నాయకులు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రజలను మభ్యపెట్టాలని చూసు న్నారని వివరించారు. ఇటీవల ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసిన సందర్భంలో కూడా ప్రైవేట్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం ప్రస్తావించారుగానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా కాపాడాలి, ఎలా నిలబెట్టాలి అనే దానిపై మాట్లాడలేదని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినప్పుడు ప్రైవేటీకరణ పదం కాకుండా డిజిన్వెస్ట్‌మెంట్‌ మాట వెలుగులోకి వచ్చిందని వివరించారు. మిట్టల్‌ కంపెనీ కోసం స్టీల్‌ప్లాంట్‌ను బలి చేయాలని చూడడం తగదన్నారు. మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు అనుమతులు రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన మోడీతో చేయించాలని డిమాండ్‌ చేశారు. రుషికొండపై రూ.525 కోట్లతో నిర్మించిన భవ నంపై ప్రస్తుత ప్రభుత్వం మాట్లాడలేదని, ఎంత డబ్బు వృథా చేశారో చెప్తోంది తప్ప, దాన్ని దేనికి వాడనుందో స్పష్టం చేయడంలేదని వి.శ్రీనివాసరావు అన్నారు. ఇది ప్రజల ఆస్తి కనుక ఆ భవనాలను సైన్స్‌ మ్యూజియంగా మార్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. వరదలు ఎక్కువగా రావడానికి పర్యావరణాన్ని నాశనం చేయడం, దురాక్రమణలు కారణమని సుప్రీం కోర్టు వేసిన అనేక కమిటీలు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. సముద్రపు ఒడ్డున మత్స్యకారులు ఉండే ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములన్నీ దురాక్రమణకు గురవుతున్నాయని తెలిపారు. సముద్రపు ఒడ్డున కోస్టల్‌ రీజియన్‌ ప్రకారం 20 మీటర్ల వరకు అనుమతులు ఇవ్వకూడదని, కానీ, పలు కార్పొరేట్‌ కంపెనీలు 20 మీటర్ల లోపలికి వెళ్లి వ్యర్థాలను వదులుతూ, నిర్మాణాలు చేపడుతున్నాయని అన్నారు. పర్యావరణానికి కార్పొరేట్‌ కంపెనీలు కల్పిస్తోన్న హాని వల్ల నీటి కొరత తీవ్రత పెరుగుతోందని తెలిపారు. ఉచితంగా దొరికే నీటిని కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. చెరువులను కార్పొరేట్‌ మాఫియా కబ్జా చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఇల్లు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైనందునే ఖాళీ స్థలాల్లో కొన్ని సంవత్సరాలుగా ఇల్లు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos