ప్ర‌ధాని మోదీని తీవ్రంగా విమ‌ర్శించిన మ‌న్మోహ‌న్ సింగ్‌

ప్ర‌ధాని మోదీని తీవ్రంగా విమ‌ర్శించిన మ‌న్మోహ‌న్ సింగ్‌

న్యూఢిల్లీ: మాజీ ప్ర‌ధాని, ప్ర‌ముఖ‌ ఆర్థిక‌వేత్త మ‌న్మోహ‌న్ సింగ్ గురువారం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న ఈ ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని తీవ్రంగా విమ‌ర్శించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఏడ‌వ ద‌శ పోలింగ్ స‌మ‌యంలో పంజాబీ ఓట‌ర్ల‌కు మ‌న్మోహ‌న్ అభ్య‌ర్థ‌న చేశారు. ప్ర‌ధాని హోదాను త‌క్కువ చేస్తూ మోదీ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు మ‌న్మోహ‌న్ ఆరోపించారు ఎన్నిక‌ల స‌మ‌యంలో ద్వేష‌పూరిత ప్ర‌సంగాల‌ను మోదీ చేశార‌ని మ‌న్మోహ‌న్ పేర్కొన్నారు. జూన్ ఒక‌టో తేదీన పంజాబీ ఓట‌ర్ల‌కు ఆయ‌న అపీల్ చేశారు. ప్ర‌జా స్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షిస్తూ.. ప్ర‌గ‌తిశీల అభివృద్ధిని కేవ‌లం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే అందించ‌గ‌ల‌ద‌ని త‌న అభ్య‌ర్థ‌న‌లో మ‌న్మోహ‌న్ పేర్కొన్నారు. బీజేపీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన‌ లోప‌భూయిష్ట‌మైన అగ్నిప‌థ్ స్కీమ్‌ను కూడా ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ఆ స్కీమ్‌తో దేశానికి భ‌ద్ర‌త ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంద‌న్నారు. దేశ‌భ‌క్తి, సాహ‌సం, సేవ కేవ‌లం నాలుగేళ్లే ఉంటాయ‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ ఉన్న‌దని, ఇది ఆ పార్టీ న‌కిలీ జాతీయ‌వాదాన్ని ఎత్తి చూపుతుంద‌ని పంజాబీ ఓట‌ర్ల‌కు రాసిన లేఖ‌లో ఆయ‌న పేర్కొన్నారు.అగ్నివీర్ స్కీమ్‌ను కాంగ్రెస్ పార్టీ ర‌ద్దు చేస్తుంద‌ని మ‌న్మోహ‌న్ ఆ లేఖ‌లో తెలిపారు. విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు ఇస్తూ.. మోదీ.. ప్ర‌ధాని కార్యాల‌య ఔన‌త్యాన్ని దెబ్బ‌తీసిన‌ట్లు మ‌న్మోహ‌న్ ఆ లేఖ‌లో ఆరోపించారు. గ‌తంలో ఏ ప్ర‌ధాని కూడా ఇలా విద్వేష ప్ర‌సంగాలు చేయ‌లేద‌న్నారు. త‌న‌పై కూడా కొన్ని త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌ను ఆపాదించార‌ని మోదీని మ‌న్మోహ‌న్ త‌ప్పుప‌ట్టారు. ప్రేమ‌, శాంతి, సోద‌ర‌భావాన్ని ఇవ్వాలంటూ మ‌న్మోహ‌న్ ఆ నాటి లేఖ‌లో అభ్య‌ర్థించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos