న్యూఢిల్లీ : ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇప్పటికే ఆప్ ఆ ప్రయత్నాల్లో ఉందని, ఇండియా బ్లాక్‌లోని ఇతర పార్టీ నేతలతో ఆప్ నేతలు చర్చలు జరుపుతున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇండియా బ్లాక్‌లో మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఆ రాష్ట్రంలో మాత్రం విరోధులుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని ఆప్ కరాఖండిగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆప్ వైఖరి పట్ల కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజురోజుకీ ఆప్‌కి, బిజెపికి మధ్య ముదురుతున్న వివాదాల మధ్య.. కాంగ్రెస్ ఆప్‌కి మద్దతు ఇవ్వడం లేదు. పైగా కాంగ్రెస్ నేతలు ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా బుధవారం (డిసెంబర్ 25) అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కోశాధికారి అజరు మాకెన్ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆప్‌తో పొత్తుపెట్టుకోవడం పెద్ద తప్పు చేసినట్లు వ్యాఖ్యానించారు. గతంలో 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్‌కి మద్దతు ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఢిల్లీకి, కాంగ్రెస్‌కి ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అప్పుడు మాత్రమే కాదు.. ఇటీవల జరిగిన (2024) లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కి మద్దతు ఇవ్వడం మరోసారి పొరపాటు చేసినట్లు ఆయన అన్నారు. గడచిన పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వాలు నేరవేర్చని హామీలకు సంబంధించి 12 పాయింట్ల శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. అజరు వ్యాఖ్యలపై ఆప్ మండిపడుతోంది. తరచూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పైకి బిజెపిని విమర్శిస్తున్నా… అంతర్గతంగా బిజెపితో కలిసి పనిచేస్తోందని ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల బిజెపిని ఢకొీనేందుకు ఏర్పాటైన ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్‌ను తప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని ఆప్ వర్గాలు తెలిపాయి.